—- పాఠశాలలు నిర్మించేందుకు భూముల గుర్తింపు
—నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల పాఠశాల పనులు ప్రారంభం
— 4 పాఠశాలల టెండర్లు పూర్త
— భూమికి సంబంధించి సిసిఎల్ఏకు నివేదన
— జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్
అక్షరకలం ప్రతిదిని, నల్గొండ
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంలో భాగంగా నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలలో 6 పాఠశాలలను నిర్మించేందుకు భూములను గుర్తించామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు తెలియజేశారు. సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావులతో కలిసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల పాఠశాల పనులు ప్రారంభమయ్యాయని, తక్కిన 4 పాఠశాలల టెండర్లు పూర్తయ్యాయని, భూమికి సంబంధించి సిసిఎల్ఏకు నివేదించడం జరిగిందని తెలుపగా, డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సిసిఎల్ఏ తో మాట్లాడి భూమి సమస్యను పరిష్కరించాలని, తక్కిన పాఠశాలల నిర్మాణానికి అవసరమైన భూములను అప్పగించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అంతకుముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.

వచ్చే సంవత్సరం నాటికి అన్ని పాఠశాలలు ప్రారంభం కావాలని, నెలకు ఒకసారి కలెక్టర్లు తప్పనిసరిగా వారి పరిధిలో నిర్మాణం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని,15 రోజులకు ఒకసారి పూర్తయిన నిర్మాణాల ఆధారంగా బిల్లులను చెల్లించడం జరుగుతుందని, కలెక్టర్లు క్యాలెండర్ ఏర్పాటు చేసుకొని క్యాలండర్ ప్రకారం పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని, భూ సమస్యల వల్ల ఇంకా ప్రారంభం కాని వాటిని తక్షణమే పరిష్కరించి భూములు కేటాయించాలని, టెండర్లు పూర్తయి పని కాని చోట వెంటనే పూర్తిచేసి భూమి పూజ చేయాలని చెప్పారు. పాఠశాలల నిర్మాణం నాణ్యతగా ఉండేలా థర్డ్ పార్టీ కంట్రోల్ ఏజెన్సీ ని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకుగాను డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు.రాష్ట్ర స్థాయిలో భూ సమస్యలకు సంబంధించి సీసీఎల్ఏ తో మాట్లాడి పరిష్కరించాలని, పనుల పురోగతిపై ప్రతిరోజు సమాచారం ఇవ్వాలని, నిధులకు సంబంధించి ఎక్కడ జాప్యం జరగకుండా చూసుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నదని, గతం నుండి గురుకుల వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉందనిజ్ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు, భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండేందుకు ఈ పాఠశాల ఉపయోగపడతాయని, పాఠశాలల నిర్మాణంతో పాటుజ్ మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యమని, జిల్లా కలెక్టర్లు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను మిషన్ మోడ్ లో తీసుకుని పనిచేయాలని కోరారు. రెవెన్యూ అదనపుకలెక్టర్ జే. శ్రీనివాస్ జ్మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డీవోలు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.