
- హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే
- వర్చువల్ శిక్షణను ప్రారంభించిన సీజే
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: సామాజిక వివాదాల సత్వర పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్లు క్రియాశీల పాత్ర పోషిస్తారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తొలిసారిగా 2021 లో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించడంతో, దానిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వివిధ సామాజిక వర్గాల నుంచి కమ్యూనిటీ మీడియేటర్లుగా ఎంపిక చేసిన వారికి గురువారం నిజామాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులను ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24 వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్న శిక్షణ తరగతులను వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. సామాజిక వివాదాలు, కుటుంబ తగాదాలు వంటి వాటిని కమ్యూనిటీ మీడియేటర్లు (వలంటీర్లు) మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ రిసోర్స్ పర్సన్, రిటైర్డ్ సెషన్స్ జడ్జి మహ్మద్ షమీమ్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి సునీతా కుంచాల, కామారెడ్డి సెషన్స్ జడ్జి వీఆర్ఆర్ వరప్రసాద్, నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనేవార్, న్యాయాధికారులు, రెండు జిల్లాలకు చెందిన కమ్యూనిటీ వలంటీర్లు పాల్గొన్నారు.