మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం

—-162 మున్సిపల్ వార్డులలో తుది ఓటరుజాబితా

ప్రచురణ

—జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ 

—-సిఎస్ కు వివరణ

—16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురిస్తామని వెల్లడి

అక్షరకలం ప్రతినిధి, నల్గొండ

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నల్గొండ జిల్లాలో 7 మున్సిపాలిటీలలోని 162 మున్సిపల్ వార్డులలో తుది ఓటరుజాబితాను ప్రచురించడమే కాకుండా, మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు తెలియజేశారు.

సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి, కమిషనర్ డైరెక్టర్ శ్రీదేవి లు హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నల్గొండ జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్ వివరిస్తూ ఈనెల 12 న వార్డుల వారిగా తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరిగిందని, 13న ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురించడం జరుగుతుందని, వీటిపై అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ఆర్ ఓ, ఏఆర్ఓ, నోడల్, ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి బృందాలను గుర్తించడం జరిగిందని, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రిజర్వేషన్లు వచ్చిన వెంటనే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, మెటీరియల్ కు ఇదివరకే చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు.

—-ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు…. 

అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు, వార్డు లొకేషన్ ఖరారు తర్వాత ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని, మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఎన్నికల సామాగ్రి, సిబ్బంది, శిక్షణ అన్ని రకాలుగా సమకూర్చుకొని ఎన్నికలను శాంతియుత వాతావరణంలో, ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి, కమిషనర్ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు, సమస్యత్మక, అత్యంత సమస్యత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, తగినంత బందోబస్తు, ఎన్నికల సామాగ్రి పంపిణి, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి బృందాల నియామకం, నామినేషన్ల స్వీకరణకు కార్యాలయాల గుర్తింపు వంటి అంశాలపై ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూఅదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.