కేటాయింపులు ఘనం ఖర్చు పాక్షికం…

గిరిజనులకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం

-పోడు భూములకు తక్షణం పట్టాలివ్వాలి

-గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి నాయక్

-ఘనంగా ఖమ్మం జిల్లా ఏడవ మహాసభ

అక్షర కలం/ఖమ్మం:

ఖమ్మం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు ఘనంగా చేస్తున్నా ఖర్చు మాత్రం చేయలేకపోతున్నారని చాలా సందర్భాల్లో గిరిజన బడ్జెట్ను ఇతర శాఖలకు మళ్లిస్తున్నారని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర రామ్మూర్తి నాయక్ ఆరోపించారు. ఆది నుంచి గిరిజనులకు కేటాయించిన బడ్జెట్ను పూర్తి స్థాయిలో ఖర్చు చేయకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ గిరిజన సమాఖ్య ఏడవ జిల్లా మహాసభ ఆదివారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో జరిగింది. బోనోత్ భరత్, తేజావత్ కృష్ణ, అమరయ్య, బానోత్ జగన్, ఇర్పా సురేష్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన మహాసభలో రామ్మూర్తి నాయక్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి గిరిజనులకు ఏదో ఒక రూపంలో అన్యాయం -జరుగుతూనే ఉందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పాలక వర్గాలు వివక్ష ప్రదర్శిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పించాలని రామ్మూర్తి డిమాండ్ చేశారు. ఇప్పటికీ మౌలిక వసతులకు నోచుకోని అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయని వెంటనే మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు కేటాయించాలన్నారు. గిరిజనులు పోడు నరికి సాగు చేసుకుంటున్నారని పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులందరికీ భూ హక్కు పత్రాలు అందజేయాలని, పాసు పుస్తకాలు జారీ చేసి రుణ సౌకర్యం కల్పించాలని రామ్మూర్తి కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల గిరిజన జనాభా ఉందని వీరి పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన తెలిపారు. నీరు, అడవి, భూమి పై -ఆధారపడి జీవించే గిరిజన హక్కులను హరిస్తున్నారన్నారు. దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న మంగాపురం గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని ఆయన కోరారు. గిరిజన రైతులకు ఇందిరా జల వికాస్ పథకంలో భాగంగా సాగునీటి వసతి కల్పించాలని ట్రైకార్ రుణాలను మంజూరు చేయాలని ఆయన కోరారు. మహాసభలో పేర్కొన్న డిమాండ్లకు అనుగుణంగా భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు -నర్సింహారావు, జాగర్లమూడి రంజిత్, రామ్మూర్తి, బానోత్ బచ్చారావు, రిటైర్డ్ ఆర్డివో నునావత్ పాండురంగా, బానోత్ రాంకోటి తదితరులు పాల్గొన్నారు.

-నూతన కమిటీ ఎన్నిక :

ఏడవ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా నునావత్ పాండురంగా, అధ్యక్షులుగా నాగేశ్వరరావు, కార్యదర్శిగా జగన్, వర్కింగ్ ప్రెసిడెంట్గా బోడా వీరన్న, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రాంబాబు లు ఎన్నికయ్యారు.

Leave A Reply

Your email address will not be published.