— నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
—డిప్యూటీ లేబర్ కమిషనర్
అక్షరకలం ప్రతినిధి, నల్గొండ
నల్గొండ జిల్లాలో నిర్వహించబడనున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ నెల 10, 11, 13, 14, 16, 17 తేదీల్లో, అన్ని షాపులు, వాణిజ్య సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా చెల్లించబడే సెలవు (Paid Holiday) లేదా ఓటు హక్కును వినియోగించుకునేందుకు తగిన సమయం (Time-Off) ఇవ్వాలని యాజమాన్యాలకు సూచించడం జరుగుతోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, నల్గొండ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనలు, తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్, 1988 ప్రకారం, ఉద్యోగులను ఓటు వేయకుండా అడ్డుకునే విధంగా పని చేయించటం చట్ట విరుద్ధం అని స్పష్టం చేశారు.
—చట్ట ఉల్లంఘనకు శిక్షలు…..
ఎవరైనా యజమానులు ఈ ఆదేశాలను పాటించకుండా ఉద్యోగులకు ఎన్నికల రోజున సెలవు లేదా సమయం ఇవ్వని పక్షంలో, వారిపై జరిమానా,
క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని, ఎన్నికల రోజున షాపులు, సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు.
కావున అందరు యజమానులు చట్టాన్ని గౌరవించి ఉద్యోగులకు ఎన్నికల రోజున తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునే స్వేచ్ఛ కల్పించాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, నల్గొండ విజ్ఞప్తి చేశారు.