​​ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

–వాసవి మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుభీక్షంగా ఉండాలి

— మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

—నల్గొండ ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి రూ.100 కోట్లు మంత్రి కోమటిరెడ్డి 

​—రామకోటి దేవాలయానికి ఇచ్చిన హామీలను నెరవేర్చామని వెల్లడి 

ఉమ్మడి నల్లగొండ బ్యూరో అక్షరకలం 

వాసవి మాత ఆశీస్సులతో

ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నల్గొండ పట్టణంలోని బీట్ మార్కెట్‌లోని రామకోటి స్థూప దేవాలయం మరియు గాంధీ పార్క్‌లో ఘనంగా నిర్వహించిన వాసవి మాత జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్న తొలి వాసవి మాత జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం విశేషమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. బాసర, కాలేశ్వరం దేవాలయాలు, గోదావరి పుష్కరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే, రామకోటి దేవాలయానికి 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలను గుర్తుచేసుకుంటూ, ధ్వజస్తంభం, మార్కెట్ యార్డ్ స్థలం 120 గజాలు, దేవాలయ అభివృద్ధికి మరో 120 గజాలు అందజేసినట్లు చెప్పారు. గుడి ఎదుట పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకున్నానని వివరించారు.పట్టణంలో రామాలయం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, వచ్చే సంవత్సరం ఉత్తర ద్వార దర్శనం వరకు పూర్తి చేస్తామని తెలిపారు. గాంధీ పార్క్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కుంకుమార్చన, అభిషేక కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీ పార్క్‌లోని భవనాన్ని పునర్నిర్మించేందుకు పూర్తి సహకారం అందిస్తామని, ప్రస్తుతం బాట లేని సమస్యను పరిష్కరించి, డీఎంహెచ్ఓ కార్యాలయం మారిన వెంటనే రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా రామాలయం, ఆంజనేయస్వామి ఆలయం, బ్రహ్మంగారి గుట్టలోని శివాలయ అభివృద్ధి పనులను రూ.100 కోట్లతో రెండు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు.

ప్రకాశం బజార్ వ్యాపారుల అభివృద్ధి కోసం ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని సమయాల్లో ప్రజలకు అండగా ఉంటానని మంత్రి స్పష్టం చేశారు. భక్తి, సేవ, అభివృద్ధి అనే మూడు అంశాలలో పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి,తహసిల్దార్ పరుశురాం, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగొనిరమేష్,మాజీ జెడ్పిటిసి గుమ్మలమోహన్ రెడ్డి,మాజీ జెడ్పిసి వంగూరు లక్ష్మయ్య, కార్పొరేటర్లు కవిత ,పెరిక స్వాతి, ఆర్యవైశ్య సంఘం సభ్యురాలు నాంపల్లి భాగ్య, నరసింహ, యమ మురళి, దైవాదినం,ఆర్యవైశ్య సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.