గ్రామాభివృద్ధి సర్పంచుల పైన ఆధారపడి ఉంటుంది 

— జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం 

గ్రామాభివృద్ధి సర్పంచుల పైన ఆధారపడి ఉంటుందని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు.

మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని టీటీడీసీలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అభివృద్ధి, సంక్షేమం జోడేడ్లలా ముందుకెళ్ళినప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, అది సర్పంచులపై ఆధారపడి ఉంటుందని కలెక్టర్ అన్నారు .గ్రామంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సర్పంచులు కృషి చేయాలని చెప్పారు.

సర్పంచులు చట్టాలు, హక్కులు, బాధ్యతలతో పాటు, ప్రభుత్వ అమలు చేసే అన్ని పథకాల పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, తెలియని అంశాలను నేర్చుకోవాలని, నేర్చుకోవడం ద్వారానే అన్ని అంశాలలో ముందు ఉండవచ్చని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని చెప్పారు. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో రానున్న కాలం మొత్తం ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ పైనే ఆధారపడి ఉంటుందని, అందువల్ల దానికి తగ్గట్టుగా నేర్చుకుని ముందుకెళ్లడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. సర్పంచులు గ్రామాలలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తీర్చినట్లయితే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఇది అధికారులకు కూడా వర్తిస్తుంది అన్నారు. జిల్లా పంచాయతీ అధికారి శంకర్ నాయక్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.