–రూ. 63,160 సీజ్
— హైదరాబాద్ లోని రిజిస్ట్రార్ ఇంట్లో కూడా సోదాలు
–వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్
-మహిళ అనధికారికంగా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తింపు
–పనిచేయని సిసి కెమెరాలు
–ఉద్దేశపూర్వకంగానే డిస్కనెక్ట్ చేశారన్న ఎసిబి డిఎస్పి
అక్షరకలం ప్రతినిధి, నల్గొండ
నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సాయంత్రం ఆకస్మాత్తుగా దాడులు చేశారు. ఏకకాలంలో హైదరాబాదులోని రిజిస్ట్రార్ కూడా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ జగదీశ చంద్ర మాట్లాడుతూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై అనేక ఫిర్యాదులు అందాయని ఆ మేరకు అకస్మాత్తుగా దాడులు నిర్వహించామని చెప్పారు. దాడుల సమయంలో రికార్డులు, దస్తావేజులు స్వాధీన పరుచుకున్నామన్నారు.

తనిఖీల సమయంలో కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ తో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారని వీరితో పాటు ఆరుగురు డాక్యుమెంట్ రైటర్లు, మరో ఆరుగురు వారి అసిస్టెంట్లు ఉన్నారని చెప్పారు. కార్యాలయంలో ఓ మహిళ అనధికారికంగా విధులు నిర్వహిస్తుందని ఆమెకు ప్రతిరోజు రూ.500 చొప్పున అనధికారికంగా చెల్లిస్తున్నట్టు విచారణలో తేలినట్లు తెలిపారు. కార్యాలయంలో అనధికారికంగా ఉన్న, ఆధారాలు లేని 63,160 నగదును సీజ్ చేశామని తెలిపారు. రిజిస్ట్రేషన్ అయిన 19 దస్తావేజులు క్లయింట్ కు ఇవ్వకపోవడంతో కార్యాలయంలోనే ఉన్నాయన్నారు. కార్యాలయంలో నాలుగు సీసీ కెమెరాలు ఉంటే కేవలం ఒకటే సీసీ కెమెరా పనిచేస్తుందని, మిగిలిన మూడు సీసీ కెమెరాలు కావాలని ఉద్దేశపూర్వకంగానే డిస్కనెక్ట్ చేశారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోదాలు చేపట్టామని, నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ దాడుల్లో సిఐలు వెంకటరావు, కిసాన్ ఏసీబీ అధికారులు ఉన్నారు.