గడువులోగా ‘సర్’ ప్రక్రియ పూర్తి చేయాలి

 

— రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

ఉమ్మడి నల్గొండ బ్యూరో అక్షరకలం

సర్ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఈఆర్వోలు), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఈ ఆర్వోలు)తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 1,812 మంది బీఎల్‌ఓలను నియమించి వారికి కిట్లు, టీ-షర్టులు, క్యాపులు, ఐడీ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ప్రతి బీఎల్‌ఓకు అవసరమైన రెండు రకాల ఎన్యుమరేషన్ ఫారాలను అందించామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 94 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, బీఎల్‌ఓలు, సూపర్వైజర్లు ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందజేస్తున్నారని తెలిపారు. సాంకేతిక సమస్యలు ఏవీ లేవని, మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ఫారాల పంపిణీ, సేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. బీఎల్‌ఓలు, సూపర్వైజర్లు తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందజేసి తిరిగి స్వీకరించాలని సూచించారు. విధుల నిర్వహణ సమయంలో బీఎల్‌ఓలు ఐడీ కార్డు, టీ-షర్టు, క్యాప్ ధరించాలని చెప్పారు. ఏఆర్వోలు ఎప్పటికప్పుడు ప్రక్రియను పర్యవేక్షించాలని, ప్రతి ఫారంలో ఓటరు ఫోటో, సంతకం తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. సర్ ప్రక్రియపై సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు

నిర్ణయిత గడువులోగా ఫారాలను పంపిణీ చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, అసిస్టెంట్ కలెక్టర్( ట్రైనీ) శ్రీకాంత్ రెడ్డి, ఎన్నికల అధికారులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.