బ్యాన్ పీరియడ్ లో జిల్లా పరిషత్ కు బదిలీ

  • ఆపై డిప్యూటేషన్..  రద్దు చేయాలని ఎమ్మెల్యే సూచన
  • ఒక్కరి కోసం అధికారుల సహకారం

బతుకమ్మ, నిజామాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బదిలీలను నిషేధించింది. తాము ఉత్తర్వులు జారీ చేసే వరకు బదిలీలను చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. జూన్ మాసంలో మొత్తం బదిలీ నిషేధం (బ్యాన్ పీరియడ్) ఉంది. ఇదే నెలలో జిల్లా పరిషత్ అధికారులు గుట్టు చప్పుడు గాకుండా ఆ ఒక్కరి కోసం లోలోన బదిలీ ప్రక్రియ చేపట్టారు. అనారోగ్యంగా ఉన్నందుకో.. వికలాంగుడో అని కాదు… సకల అవయవాలు అన్నీ చక్కగా ఉన్న ఉద్యోగి కోసం జడ్పీ అధికారులు సహకరించారంటే ఏమి ఒప్పందాలు జరిగాయోననే అనుమానాలు జడ్పి ఉద్యోగులలో వ్యక్తమవుతున్నాయి. బదిలీలు చేయరాదనే కఠిన నిర్ణయాలు ఉన్నప్పటికీ మోపాల్ మండల పరిషత్ లో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ ( వీఆర్వో) ను జిల్లా పరిషత్ కు అకారణంగా బదిలీ చేశారు. మరుసటి రోజు మళ్ళీ యధా స్థానానికి డిప్యూటేషన్ పై పంపించారు. బదిలీ ఎందుకు చేశారు… డిప్యూటేషన్ ఎందుకు వేశారు.. అనే సంశయం నుంచి తేరుకునే లోపు ఒక సంఘటన ఆశ్చర్యపరచింది. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న ఉద్యోగికి మోపాల్ లో జూనియర్ అసిస్టెంట్ స్థానంలో పోస్టింగ్ ఇచ్చి, వెనువెంటనే జడ్పికి డిప్యూషన్ పై తీసుకురాగలిగారు. ఇదంతా చేయడంలో అధికారుల ఉత్సాహం ఊహించని విధంగా ఉన్నదని పరిషత్ ఉద్యోగులు నోరు వెళ్లబెడుతున్నారు. ఆ ఉద్యోగి విధుల్లో చేరినప్పటి నుంచి జిల్లా పరిషత్ లోనే మఖాం వేస్తున్నాడనే దానికంటే.. గద్దలా జడ్పీని పట్టుకు వేలాడుతున్నాడనే సామెత సరిపోతుందనే ఏహ్య భావాన్ని జడ్పీ ఉద్యోగులు కనబరుస్తున్నారు.

రగులుతున్న ఉద్యోగులు : ఎక్కడెక్కడో విధులు నిర్వహిస్తున్న వారు జిల్లా కేంద్రానికి రావాలని ఆశిస్తుంటారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వకుండా జిల్లా పరిషత్ లో ఏళ్ల తరబడిగా విధులు నిర్వహిస్తున్న వారికి అధికారులు సహకరించి పట్టం కట్టడంతో జడ్పీ ఉద్యోగులలో సహనం నశించిపోతున్నట్లు కనబడుతోంది. అదే జరిగితే పర్యవసానం వేరేలా ఉంటుందనే సంకేతాలను సహచర ఉద్యోగులు పరోక్షంగా బహిర్గతం చేస్తున్నట్లు సమాచారం.

డిప్యూటేషన్ రద్దు చేయాలి : రూరల్ నియోజకవర్గం లో ఉన్న ఉద్యోగుల డిప్యూటేషన్ వెంటనే రద్దు చేసి యధాస్థానానికి పంపాలని ఎమ్మెల్యే ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సైతం డిప్యూటేషన్ రద్దు చేయాలని చెప్పినట్లు జడ్పీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. డిప్యూటేషన్ రద్దును కోరుతూ పరిషత్ అధికారులు జిల్లా కలెక్టర్ కు ఫైల్ పెట్టాల్సి ఉంటుంది. ఇంతవరకు అలాంటి ప్రక్రియ జరగలేదేమోనని, వారిని ఉపేక్షించేందుకే కాలయాపన చేస్తున్నట్లు కనబడుతోందని ఉద్యగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బదిలీ నిషేధం సమయంలో బదిలీ చేయడమే గాకుండా డిప్యూటేషన్ వేయడం పై ఉన్నతాధికారులకు, ముఖ్యమంత్రికి సహచర ఉద్యోగులు ఫిర్యాదు చేయనున్నారనే సంకేతాలు కనబడుతున్నాయి. విచారణ జరిపితే జడ్పిలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలతో పాటు మరికొన్ని వాస్తవాలు బయటపడడమే గాకుండా ఉద్యోగులకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం జిల్లా పరిషత్ లో వ్యక్తమవుతోంది.

Leave A Reply

Your email address will not be published.